ప్రముఖ మొబైల్ యాప్ TikTok కి భారత్‌లో ఊహించని షాక్ తగిలింది. టిక్ టాక్ యాప్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో 1 స్టార్ రేటింగ్‌లో ఉన్న ఈ యాప్ ఇప్పటికే భారత్‌లో ఓసారి బ్యాన్ అయ్యి, బయటపడింది. ఇప్పుడు మరోసారి బ్యాన్ ముంగిట నిలిచింది. కొన్ని రోజుల క్రితం వరకు గూగుల్ ప్లే స్టోర్‌లో 4.5 స్టార్ రేటింగ్‌తో ఉన్న టిక్ టాక్ యాప్ ప్రస్తుతం 1.3 స్టార్ రేటింగ్‌తో కొనసాగుతోంది. చాలా మంది యూజర్లు ఇచ్చిన కామెంట్లను చెక్ చేస్తే... టిక్ టాక్ వైఖరిని తప్పుపడుతున్నారు.
కొందరు సాంకేతిక సమస్యలను అంటున్నారు. డౌన్ లోడ్ చేసిన వెంటనే ఓపెన్ కావడం లేదని, ఏవైనా సమస్యలు వస్తే టెక్నికల్ టీం స్పందించడం లేదని ఇంకొందరు చెప్పారు. మరోవైపు ఫైజల్ సిద్ధికీ అనే ఓ యూజర్ భారత్‌లో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలంటూ జాతీయ మహిళా హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓ యువతిపై యాసిడ్ దాడి చేస్తున్నట్లుగా వీడియో ఉండటంపై NCW తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. నిజ జీవితంలో 15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడిని ఎదుర్కొన్న లక్ష్మీ అగర్వాల్ కూడా ఆ వీడియోను తప్పుపట్టారు.
మరోవైపు ఆ హింసాత్మక వీడియోపై టిక్ టాక్ స్పందించింది. ‘సురక్షితమైన పర్యావరణాన్ని పెంపొందించడం టిక్ టాక్ ప్రాధాన్యతలలో ముఖ్యమైంది. టిక్ టాక్ ప్లాట్ ఫాం మీద ఏం అనుమతి ఉంది? వేటికి అనుమతి లేదు అనే విషయాలు నియమ నిబంధనలు, మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంటాయి. దీన్ని మా యూజర్లు అన్ని సమయాల్లో పాటిస్తారని ఆకాంక్షిస్తున్నాం.’ అని వివరణ ఇచ్చింది.
గత కొన్ని రోజులుగా టిక్ టాక్‌లో కొందరు యూజర్లు తమ పాలసీలకు వ్యతిరేకంగా హింసాత్మక వీడియోలను పోస్టు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. అలాంటి కంటెంట్‌ను తాము నియంత్రించినట్టు పేర్కొంది. హింసాత్మక వీడియోలను పోస్టు చేస్తున్న యూజర్ల అకౌంట్లను సస్పెండ్ చేశామని, దీనిపై చట్ట సంస్థలతో చర్చిస్తున్నట్టు తెలిపింది.
Post a Comment